ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు మరోసారి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే కేసులో అనేక వివరాలను సేకరిస్తున్న ఏసీబీ అధికారులు, తాజా పరిణామాలతో దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఏసీబీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరై పూర్తి సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ-కార్ రేస్ నిర్వహణలో ప్రభుత్వ నిధుల వినియోగంలో జరిగిన అక్రమాలు, ఒప్పందాల కేటాయింపుల సమయంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏసీబీ దృష్టి సారించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను, సంబంధిత సంస్థల ప్రతినిధులను ఏసీబీ విచారించినట్లు సమాచారం. తమ విచారణలో సేకరించిన ఆధారాల ఆధారంగా మరింత లోతుగా విచారణ కోసం కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్‌కు మరోసారి నోటీసులు అందడంతో రాజకీయ వర్గాల్లో కూడా ఈ విషయంపై పెద్ద చర్చ మొదలైంది. ప్రభుత్వానికి చెందిన నిధులు ఎంత మేర వినియోగించబడ్డాయో, ఒప్పందాలు ఎలా కుదిరాయో వంటి అంశాలపై ఏసీబీ స్పష్టమైన వివరాలు రాబట్టేందుకు సుదీర్ఘ విచారణ కొనసాగిస్తోందని సమాచారం.
ఈ దర్యాప్తులో ఇంకా ఎన్నెన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read More : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుంది

One thought on “ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో విచారణ వేగం”
Comments are closed.