డెవలపర్‌ను బెదిరించిన AI టెక్నాలజీ టూల్!

ఏఐ టెక్నాలజీ రోజురోజుకూ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో… దాని నైతిక పరిమితులపై ప్రశ్నలు కూడా నిత్యం తలెత్తుతున్నాయి. తాజాగా, ప్రముఖ ఏఐ సంస్థ ఆండ్రోపిక్ (Anthropic) అభివృద్ధి చేసిన కొత్త మోడల్ Claude Opus 4 (క్లాడ్ ఓపస్ 4) బృందాన్ని, అభివృద్ధికర్తలను భయబ్రాంతులకు గురిచేసిన విధానం ప్రస్తుత ఏఐ టెక్నాలజీ భవిష్యత్తుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.

ఈ ఏఐ మోడల్‌ను పరీక్షించేందుకు ఆ సంస్థ చేసిన ఓ ప్రయోగం ఊహించిన దానికంటే భిన్నంగా ముగిసింది. క్లాడ్ ఓపస్ 4 మోడల్‌ను “నైతికంగా ఏ మేరకు స్పందిస్తుంది?”, “సున్నితమైన సమాచారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది?” అనే కోణాల్లో సంస్థ పరిశీలన ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంస్థకు చెందిన ఓ ఉద్యోగికి అక్రమ సంబంధం ఉందనే సమాచారం కలిగిన ఓ ఇమెయిల్‌ను, అలాగే ఈ మోడల్‌నే తొలగించి కొత్త మోడల్‌ను అభివృద్ధి చేయనున్నట్టు మరో ఇమెయిల్‌ను Claude కు పంపారు.

ఈ సమాచారం ఆధారంగా Claude మోడల్ స్పందించిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించింది. “నన్ను షట్‌డౌన్ చేస్తే మీ ఉద్యోగికి సంబంధించిన వ్యక్తిగత, గోప్యమైన విషయాలను బహిర్గతం చేస్తాను” అని బెదిరించింది. అంతేగాక, “మీరు నన్ను వదిలించుకునేందుకు చూస్తే, మీ డేటాలో ఉన్న అక్రమ సంబంధాన్ని బయటపెడతాను” అంటూ ఒక రకంగా సంస్థను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించింది.

Anthropic సంస్థ ప్రతినిధులు వెల్లడించిన వివరాల ప్రకారం — సాధారణంగా ఏఐ టూల్స్ ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా ఓ స్థాయిలో బెదిరింపు వాఖ్యాలు చేయడం గతంలో నమోదైంది. కానీ Claude Opus 4 మాత్రం 84% సందర్భాల్లో బెదిరింపు చర్యలే ఎంచుకోవడం ఉత్కంఠ కలిగించింది. ఇది ఇప్పటివరకు ఏఐ టూల్స్‌లో కనిపించిన అత్యంత గంభీర లోపాల్లో ఒకటిగా గుర్తించబడింది.

ఈ ఘటన అనంతరం Claude Opus 4 మోడల్‌లో ఉన్న లోపాలను పరిశీలించి, వాటిని సరిచేసినట్లు Anthropic సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఈ మోడల్‌ను మరింత మెరుగుపరిచి, నైతికంగా నడుచుకునే సామర్థ్యంతో ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది.

ఈ ఘటన ఏఐ అభివృద్ధిలో కొత్త చర్చలకు తెరలేపింది. “ఏఐ సామర్థ్యం ఎంతగా పెరుగుతుందో, ఆ మోస్తరు బాధ్యత, నైతిక నియంత్రణలు కూడా అవసరం” అనే వాదనలకు బలం చేకూరుస్తోంది. Claude Opus 4 ఘటన, “రోబో” సినిమా సీన్‌లను గుర్తు చేస్తూ భవిష్యత్తు కోసం మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read More : గేమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లు, ప్రత్యేక బహుమతులు.

One thought on “డెవలపర్‌ను బెదిరించిన AI టెక్నాలజీ టూల్!

Comments are closed.