చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురంలో అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసిన దారుణ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే బాధిత మహిళతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన మంత్రి, ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
పూర్తి వివరాలను స్వయంగా బాధితురాలి నుంచి తెలుసుకున్న అనిత, ఈ ఘటనపై అధికారులను తక్షణమే స్పందించాలంటూ ఆదేశించారు. చిత్తూరు ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలుతో మాట్లాడిన ఆమె, ఘటనపై సమగ్ర నివేదికను వెంటనే అందజేయాలని సూచించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ ఘటనపై స్పందిస్తూ హోంమంత్రి అనిత సోషల్ మీడియాలో కూడా ఓ వీడియోను పంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, ఆత్మగౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనీ, ఇటువంటి అన్యాయాలను క్షమించబోమని హెచ్చరించారు. బాధితురాలికి న్యాయం జరిగేంతవరకూ ప్రభుత్వం ఆమెకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

2 thoughts on “చిత్తూరులో చెట్టుకు కట్టిన ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర స్పందన”
Comments are closed.