ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ ఆధారిత చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఈ సేవలను వినియోగించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓపెన్ఏఐ (OpenAI) సంస్థ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ యూజర్లకు క్షమాపణలు తెలియజేసింది. సమస్యను గుర్తించామని, త్వరలోనే దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. చాట్‌జీపీటీ గ్లోబల్ అవుటేజ్‌పై త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇస్తామని పేర్కొంది.
భారత కాలమానం ప్రకారం, గురువారం తెల్లవారుజాము నుంచి చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఓపెన్ఏఐకి చెందిన ఏపీఐలు, సోరా సేవలకూ ఈ సమస్య ప్రభావం చూపినట్లు కంపెనీ వెల్లడించింది. 2022లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చాట్‌జీపీటీని ఓపెన్ఏఐ అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్‌బాట్ ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే మనకు అవసరమైన కచ్చితమైన సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఇదీ చదవండి: వాట్సప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లో అంతరాయం
అదే సమయంలో, బుధవారం రాత్రి మెసేజింగ్ యాప్ వాట్సప్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవల్లోనూ అంతరాయం నెలకొంది. ఈ అంశంపై మెటా స్పందిస్తూ, సాంకేతిక సమస్యల కారణంగా తమ యాప్‌లను కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు ఉపయోగించలేకపోతున్నారని తెలిపింది. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించి సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని మెటా పేర్కొంది.
