పని ఒత్తిడి, విశ్రాంతి లోపం – మెదడు ఆరోగ్యానికి ముప్పు

పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, డిజిటల్‌ ఓవర్‌లోడ్‌ వంటి కారణాలతో మెదడు సంబంధిత సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం స్క్రీన్‌లను చూడటం, మానసిక ఒత్తిడితో రక్తపోటు, మధుమేహం పెరగడం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆసుపత్రులకు వచ్చే రోగుల్లో 25 శాతం మంది ఈ సమస్యలను ఎదుర్కొంటున్నారని వైద్యులు వెల్లడించారు. ప్రతిరోజూ ఓపీకి వచ్చే 60 మందిలో సుమారు 20 మంది మెదడు సంబంధిత ఇబ్బందులతో వస్తున్నారని, వీరిలో 25 నుంచి 45 ఏళ్ల వయస్సు గలవారు 30 శాతం ఉన్నారని తెలిపారు. మహిళల్లో కూడా ఒత్తిడి, మధుమేహం, రక్తపోటు కారణాలతో పక్షవాతం వచ్చే అవకాశాలు పెరిగాయని వైద్యులు చెప్పారు.

యువతలో ధూమపానం, మద్యం వినియోగం పెరుగుతోంది
15 నుంచి 24 ఏళ్ల వయస్సు గలవారిలో మద్యం, ధూమపానం అలవాట్లు ఎక్కువగా ఉన్నాయని, గ్రేటర్‌లోని పొగతాగే వారిలో 30-40 శాతం ఈ వయస్సు వారేనని వైద్యులు వెల్లడించారు. దీర్ఘకాలం స్మోకింగ్‌ చేసినవారిలో మెదడు రక్తనాళాలు పూడుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, చైన్‌ స్మోకర్స్‌లో ఈ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని తెలిపారు. ఎపిలెప్సీ, డిమెన్షియా, మల్టిపుల్‌ స్క్లిరోసిస్‌, మెదడు క్యాన్సర్‌ వంటి వ్యాధులు యువతను, వృద్ధులను ప్రభావితం చేస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిరాకు, నిద్రలేమి, మరిచిపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

పోషకాహారం, నిద్ర అవసరం
మెదడు పనితీరు మెరుగుపడాలంటే వాల్‌నట్స్‌, ఆకుకూరలు, బి-విటమిన్లు, ఒమెగా-3 ప్యాటీ యాసిడ్లు ఉన్న ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచించారు. రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం, ధ్యానం, మైండ్‌పుల్‌నెస్‌ వంటి పద్ధతుల ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిదన్నారు. స్క్రీన్‌ వినియోగాన్ని తగ్గించడం ద్వారా దృష్టి, మాట్లాడే నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావాన్ని నివారించవచ్చని చెప్పారు.

ప్రతిరోజూ దాదాపు 20 మంది మైగ్రేన్‌, తలనొప్పి, నిద్రలేమి, తలతిరగడం, చేతులు, కాళ్ల తిమ్మిర్లు వంటి సమస్యలతో ఆస్పత్రులను సందర్శిస్తున్నారని వైద్యులు వెల్లడించారు. మెదడు ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేయడం అత్యవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

One thought on “పని ఒత్తిడి, విశ్రాంతి లోపం – మెదడు ఆరోగ్యానికి ముప్పు

Comments are closed.