భారత్‌లో ‘బాయ్‌కాట్ టర్కీ’ ఉద్యమం.

పాకిస్థాన్‌ సహాయందిస్తున్న టర్కీపై భారత్‌లో భారీ ఆగ్రహం వ్యక్తమవుతూ, దేశవ్యాప్తంగా ‘బాయ్‌కాట్ టర్కీ’ ఉద్యమం జోరుగా కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఏర్పడిన ఈ నిరసన టర్కీ ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ ద్వారా టర్కీకి వచ్చే ఆదాయం భారీగా తగ్గే అవకాశముందని నిపుణులు అంచనా వేశారు.

ఇస్తాంబుల్ వంటి చారిత్రక ప్రదేశాల్లో టర్కీలో ఇటీవల భారతీయులు వివాహాలకు ఎక్కువగా వెళ్ళేవారు. 2018లో కేవలం 13 భారతీయ జంటలు అక్కడ పెళ్లి చేసుకున్నా, 2023లో సంఖ్య 50కు చేరింది. వీటివల్ల టర్కీకి సగటున 140 మిలియన్ డాలర్ల పర్యాటక ఆదాయం లభిస్తున్నది. ఒక వివాహానికి సగటున 3 మిలియన్ డాలర్లు ఖర్చవుతుండగా, కొన్ని సందర్భాల్లో ఇది 8 మిలియన్ డాలర్ల దాకా చేరుతుంది. పెళ్లి సందర్బంగా వచ్చిన అతిథులు స్థానికంగా పర్యటనలు చేయడం కూడా టర్కీ ఆర్థికానికి ఉపకరిస్తుంది.

అయితే, ‘ఆపరేషన్ సిందూర్‌’ సమయంలో పాకిస్థాన్‌కు టర్కీ బహిరంగ మద్దతు ప్రకటించడంతో భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఫలితంగా దేశవ్యాప్తంగా టర్కీని బహిష్కరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 2,000కి పైగా భారతీయ పర్యాటకులు టర్కీ పర్యటనలను రద్దు చేశారు. ఈ ఏడాది టర్కీలో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యే 30కి పైగా జంటలు ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

టర్కీ పట్ల ఈ నిరసన పర్యాటకం కేవలం పర్యాటక, వివాహ రంగాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. పండ్లు, ఆభరణాల దిగుమతులు నిలిపివేయాలని పలు వ్యాపారులు నిర్ణయించగా, అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్) టర్కీ కంపెనీలతో వ్యాపార సంబంధాలను తగ్గించాలని పిలుపునిచ్చింది.

నిపుణులు అంచనా ప్రకారం, ఈ నిరసనల కారణంగా టర్కీ దాదాపు 90 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 770 కోట్లు) ఆదాయ నష్టానికి గురవుతోంది. భారతీయుల ఈ స్థాయిలో బహిష్కరణ ఉద్యమం టర్కీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Read More : డొనాల్డ్ ట్రంప్: భారత్ వాణిజ్య సుంకాలపై కీలక అప్డేట్

One thought on “భారత్‌లో ‘బాయ్‌కాట్ టర్కీ’ ఉద్యమం.

Comments are closed.