బాడీ బిల్డింగ్ చేస్తున్నవారు జాగ్రత్త! మీరు కండలు పెంచుకోవడం కోసం వేసే కష్టం ఒక్క ఆరోగ్యాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందో తాజాగా వెలుగులోకి వచ్చింది. యూరోపియన్ హార్ట్ జర్నల్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, బాడీ బిల్డింగ్ చేసే పురుషులలో గుండె సంబంధిత రోగాల ముప్పు సాధారణ వ్యక్తులతో పోల్చితే ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఈ అధ్యయనంలో 2005 నుంచి 2020 మధ్య కాలంలో 20,286 మంది ప్రొఫెషనల్ బాడీ బిల్డర్లపై పరిశోధనలు నిర్వహించారు. ఇందులో 121 మంది బాడీ బిల్డర్లు మరణించారని గుర్తించారు. ఆశ్చర్యకరంగా, వారి సగటు వయసు కేవలం 45 ఏళ్లే అని వెల్లడైంది.
పోస్టుమార్టం నివేదికలు బాడీ బిల్డర్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చాటిచెప్పుతున్నాయి. గుండె పరిమాణం పెరగడం, కరోనరీ ఆర్టరీ డిసీజ్, అనబాలిక్ స్టెరాయిడ్స్ దుర్వినియోగం వంటి అంశాలు ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా తేలాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికాలో ఎక్కువగా మరణాలు నమోదవగా, ఆ తరువాత యూరోప్, ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఓషియానా ఖండాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు పరిశోధకులు తెలిపారు.
అధిక కండల కోసం బాడీ బిల్డర్లు అనుసరించే ఆహార నియమాలు, మానసిక ఒత్తిడి, హార్మోన్ మందుల వినియోగం తదితర అంశాలు వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తున్నాయని ఈ అధ్యయనంలో స్పష్టమైంది. ఇది శరీర ఆకృతి గురించి మాత్రమే కాదు, ఆరోగ్యం గురించి కూడా అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మొత్తంగా చెప్పాలంటే, కండలు పెంచుకోవాలనే ఉద్దేశంతో అధిక శ్రమ, హార్మోన్ మందుల వినియోగం వంటివి ఆరోగ్యానికి హానికరమని, బాడీ బిల్డింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన కలిగి ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
Read More : ఈ సమస్యలతో బాధపడే వారు పాలు తాగకూడదు.
