పాట్నాలో రాహుల్, తేజస్విల ర్యాలీ

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్)పై బీహార్‌లో రాజకీయ తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఈ సవరణ ప్రక్రియను తప్పుబడుతూ విపక్ష మహాఘట్‌బంధన్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మంగళవారం పాట్నాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఉదయం 10 గంటలకు గోలంబర్‌లోని ఆదాయపన్ను కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్రానికి వ్యతిరేకంగా కూడా ఈ కార్యక్రమం నడిపారు. ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ గందరగోళానికి దారి తీస్తోందని, దీనివల్ల ఎన్డీయేకి లబ్ధి చేకూరుతుందన్న ఆరోపణలతో మహాఘట్‌బంధన్ సంయుక్తంగా ‘చక్కా జామ్’ నిర్వహిస్తోంది. హాజీపూర్, సోన్‌పూర్ ప్రాంతాల్లో ఆర్జేడీ కార్యకర్తలు టైర్లు కాల్చి రోడ్లను దిగ్బంధించారు. హాజీపూర్‌లోని గాంధీ సేతుపై కార్యకర్తలు ఆందోళన చేపట్టగా, సోన్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే ముఖేశ్ రోషన్ స్వయంగా నిరసనకు నాయకత్వం వహించారు.

జెహానాబాద్‌లో ఆర్జేడీ విద్యార్థి విభాగం రైల్వే పట్టాలపై బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఉద్యమానికి కాంగ్రెస్, వామపక్షాలు, వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ, స్వతంత్ర నేత పప్పు యాదవ్ వంటి పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇక 10 ప్రధాన కార్మిక సంఘాలు చేపట్టిన ‘భారత్ బంద్’కు మద్దతుగా కూడా ఈ నిరసనల్ని విపక్షాలు కొనసాగిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ఇది ఎన్నికల సమయానికి ముందు రాజకీయ వేడి పెంచే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : ర్యాగింగ్‌పై యూజీసీ కఠిన చర్యలు