పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హిందూపురం ప్రజలపై తన గాఢమైన ప్రేమను, కృతజ్ఞతను సినీ నటుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తం చేశారు. హిందూపురంలో ఏర్పాటు చేసిన సన్మాన సభను జీవితంలో మరచిపోలేని అనుభూతిగా అభివర్ణించిన ఆయన… హిందూపురం తనకు కేవలం నియోజకవర్గం మాత్రమే కాదని, అది తన హృదయ స్పందన అని అన్నారు.
‘‘పద్మభూషణ్ అనే గౌరవప్రదమైన పురస్కారం లభించిన ఈ విశిష్ట ఘడియల్లో, హిందూపురం ప్రజలు చూపిన ప్రేమ, ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేను. మీరు ఏర్పాటు చేసిన సన్మాన సభ నాకు జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన అనుభూతిగా నిలిచిపోతుంది. ఇది ప్రజలిచ్చే గౌరవం మాత్రమే కాదు… తండ్రికి పిల్లలు చూపే ఆత్మీయతలా అనిపించింది’’ అంటూ బాలయ్య భావోద్వేగంగా స్పందించారు.
‘‘హిందూపురం నా కోసం ఓ నియోజకవర్గం కాదు… అది నా మనసులోనిది. మీరు చూపిన ప్రేమ, ఆశీర్వాదం నా జీవితాంతం వెలుగులా నా వెంట నడుస్తాయి. ఆ ప్రేమకు నేను జీవితాంతం నిస్వార్థ సేవతో బదులిస్తాను. ఈ పురస్కారాన్ని ఇచ్చిన భారత ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. హిందూపురం ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు’’ అంటూ బాలకృష్ణ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా బాలయ్యకు హిందూపురంలో ఘన స్వాగతం లభించగా, అభిమానులు, నాయకులు పెద్దఎత్తున తరలివచ్చి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అభిమానం చూసి బాలయ్య కళ్ళు చెమ్మగిల్లాయి.
Read More : సీఎం శుక్రవారం అనంతపురంలో పర్యటన

2 thoughts on “పద్మభూషణ్‌కు హిందూపురం ప్రజలకు బాలయ్య కృతజ్ఞతలు”
Comments are closed.