వాయుకాలుష్య ప్రభావం: రాష్ట్రంలో పీల్చే గాలి నాసిరకంగా మారుతున్న పరిస్థితులు

ప్రఖ్యాత వైద్య జర్నల్ లాన్సెట్ ప్రకారం, భారత మహానగరాల్లో నిత్యం 7% ఆకాల మరణాలకు వాయుకాలుష్యం ప్రధాన కారణంగా ఉంది. ఈ సమస్య మహానగరాలకే పరిమితం అనుకున్నప్పటికీ, ఇప్పుడు చిన్న పట్టణాల్లో కూడా వాయుకాలుష్యం తీవ్ర సమస్యగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి 13 నగరాలు జాతీయ వాయునాణ్యత ప్రమాణాలను అందుకోలేకపోతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది.
గణాంకాల ప్రకారం, గాలి నాణ్యత సూచీ (AQI) రాష్ట్రంలో 110-140 మధ్యలో ఉండగా, ఇది రోజుకు రెండు సిగరెట్లు కాల్చినంత దుష్ప్రభావం కలిగిస్తోంది. అతి సూక్ష్మ దూళికణాల సాంద్రత (PM 2.5) నేషనల్ ప్రమాణం 5 మైక్రోగ్రాములకు మించకూడదనగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇది 30-45 మైక్రోగ్రాముల మధ్య ఉంది. PM 10 సాంద్రత కూడా నాలుగురెట్లు అధికంగా ఉంది.
1988లో రాష్ట్రంలో PM 2.5 సగటు 17.8గా ఉండగా, 2024 నాటికి ఇది 70-80% పెరిగింది. దీని కారణంగా శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు, వృద్ధులు, పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. నిపుణులు ఈ పరిస్థితిని పరిష్కరించేందుకు అత్యవసర చర్యలు అవసరమని హెచ్చరిస్తున్నారు.