‘బలగం’ తర్వాత మరో భావోద్వేగ కథతో వేణు యెల్దండి – ‘ఎల్లమ్మ’

‘బలగం’ ద్వారా బలమైన కథ, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు వేణు యెల్దండి, త్వరలో ‘ఎల్లమ్మ’ అనే మరో ప్రాజెక్ట్‌తో ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కథానాయకుడిగా నితిన్ ఎంపిక కాగా, కథానాయికగా సాయిపల్లవి దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇటీవలే ఆమె కథను విన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

‘బలగం’లో చూపించిన ఎమోషన్లను మించిపోయే భావోద్వేగాలు ‘ఎల్లమ్మ’ చిత్రంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సంస్కృతిలో గ్రామ దేవతల ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఎల్లమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, పోశమ్మ వంటి వివిధ నామాలతో గ్రామదేవతలు పూజలందుకుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గంగానమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ వంటి దేవతలను ఆరాధిస్తారు.

ఈ గ్రామదేవతల నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దర్శకుడు వేణు యెల్దండి ఈ కథను అల్లినట్లు తెలుస్తోంది. అయితే ఇది భక్తిరస చిత్రం కాదని, ‘బలగం’ తరహాలో భావోద్వేగ ప్రయాణమని అంటున్నారు. సాయిపల్లవి సినిమా ఒప్పుకుంటే అది గొప్పదై ఉంటుందన్న నమ్మకం ఆమె అభిమానుల్లో ఉంది.

ప్రస్తుతం ‘ఎల్లమ్మ’ టీమ్ స్క్రిప్ట్ పనుల్లో నిమగ్నంగా ఉంది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్న ఈ చిత్రానికి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.

‘ఎల్లమ్మ’ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందనే ఆసక్తి నెలకొంది.