దర్శకధీరుడు రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో భారీ చిత్రం ప్రారంభం
హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మరియు సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఈ చిత్రం ప్రముఖంగా ప్రచారంలో ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాణం నేడు అధికారికంగా ప్రారంభమైంది.
హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పూజా కార్యక్రమంతో ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. మహేశ్‌బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారనీ, చిత్ర బృందంతో కలిసి పూజ నిర్వహించారనే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ వేసవి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందని, మొదటి భాగం 2027లో విడుదలకు సిద్ధమవుతోందని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ నటీనటులు, టెక్నీషియన్స్ కూడా ఈ చిత్రంలో భాగం కావొచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
సరికొత్త కథ, ప్రపంచం
రచయిత విజయేంద్రప్రసాద్ గతంలో చెప్పినట్లుగా, రాజమౌళి ఈ చిత్రంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా ఈ సినిమాను అనువదించనున్నారు.
మహేశ్‌బాబు సరికొత్త లుక్
ఈ సినిమాలో మహేశ్‌బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన గత కొన్ని నెలలుగా ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. మరోవైపు, రాజమౌళి ఈ సినిమాకు తగిన లొకేషన్స్ కోసం గతంలో ఒడిశా, ఆఫ్రికా అడవుల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
