చై – శోభిత ప్రేమకథ: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి గోరింటాకు

చై – శోభిత: ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి గోరింటాకు.. ప్రేమకథ

అక్కినేని నాగచైతన్య మరియు శోభితల వివాహం ఈ నెల 4న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఓ ఇంగ్లిష్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో వారు తమ పరిచయం, ప్రేమ గురించి మాట్లాడారు.

“2022 ఏప్రిల్‌ నుంచి నాగచైతన్యను ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నా. నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. నేను, చైతన్య ఎప్పుడూ కలిస్తే, ఫుడ్‌ గురించి మా అభిప్రాయాలు పంచుకుంటాం. నాగచైతన్య నాకు తరచూ ‘తెలుగులో మాట్లాడా’ని అడుగుతారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడింది. ఇన్‌స్టాలో నేను స్ఫూర్తినిచ్చే కథనాలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్ట్‌లను చేస్తాను. వాటికి నాగచైతన్య లైక్‌ చేయేవారు.”

“మొదటిసారి ముంబయిలో ఓ కేఫ్‌లో చైతన్యను కలిశాను. ఆ సమయంలో చైతన్య హైదరాబాద్‌ నుండి వచ్చి ముంబయిలో ఉండేవారు. ఆ తర్వాత ఒకసారి రెడ్‌ డ్రెస్‌లో నేను, బ్లూ సూట్‌లో చైతన్య ఉన్నప్పుడే మా పరిచయం మరింత బలపడింది. కర్ణాటకలోని ఓ పార్క్‌లో కొంత సమయం గడిపాము. అక్కడ ఇద్దరూ గోరింటాకు పెట్టుకున్నాం. తరువాత అమెజాన్‌ ప్రైమ్‌ ఈవెంట్‌కు వెళ్ళాం. ఆ తరువాత జరిగినవన్నీ అందరికీ తెలిసిన విషయమే.”

“న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం నాగచైతన్య కుటుంబం నన్ను ఆహ్వానించింది. మరుసటి సంవత్సరం, చైతన్య నా కుటుంబాన్ని కలిశారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత, ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రతిపాదన చేశాడు,” అని శోభిత చెప్పింది.

నాగచైతన్య మాట్లాడుతూ, “శోభితను తెలుగులో మాట్లాడమని ఎప్పుడూ అడిగేవాడిని. సినీ ఇండస్ట్రీలో వివిధ భాషలకు చెందిన వ్యక్తులు కలుస్తుంటారు. తెలుగు మాట్లాడే వారితో త్వరగా కనెక్ట్‌ అవుతాను. శోభిత పరిచయం అయినప్పుడు కూడా ఆమెను తెలుగులో మాట్లాడాలని అడిగేవాడిని,” అని చెప్పారు.