కర్ణాటకలో సెప్టెంబర్ 22 నుంచి కుల గణన సర్వే ప్రారంభం

కర్ణాటక ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న సామాజిక–ఆర్థిక–విద్యా సర్వే (కుల గణన)కు సిద్ధమైంది. ఈ సర్వేను సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు 15 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బృహత్తర సర్వేను కర్ణాటక రాష్ట్ర వెనుకబాటు తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో చేపడుతుండగా, అక్టోబర్ చివరి నాటికి నివేదికను సమర్పించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారులను ఆదేశించారు. ఈ నివేదిక రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించనుంది.

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. “కుల వివక్ష నిర్మూలనకే ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలోని 7 కోట్ల మంది ప్రజలను కవర్ చేసే ఈ సర్వే దేశానికి ఆదర్శంగా నిలవాలి” అని ఆయన పేర్కొన్నారు.

ఈ సర్వేలో వ్యక్తుల ఆర్థిక స్థితి, భూమి యాజమాన్యం, సామాజిక గుర్తింపు వంటి సమగ్ర వివరాలను సేకరించనున్నారు. 2015లో నిర్వహించిన సర్వే వొక్కలిగ, వీరశైవ–లింగాయత్ వర్గాల విమర్శలకు గురవడంతో ఆ నివేదికను పక్కన పెట్టారు. ఈసారి మొబైల్ యాప్ సాయంతో మరిన్ని అంశాలను చేర్చి సర్వే నిర్వహించనున్నారు.

సర్వే విజయవంతం చేయడానికి 1.65 లక్షల మంది ఎన్యుమరేటర్లు, ఉపాధ్యాయులు, ఇతర శాఖల సిబ్బంది పాల్గొననున్నారు.

Read More : ముంబయి ట్రైన్ పేలుళ్ల కేసులో సుప్రీంకోర్టు స్టే