సినీ నటుడు రాజీవ్ కనకాల భూ లావాదేవీ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో రాచకొండ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఇదే వ్యవహారంలో సినీ నిర్మాత విజయ్ చౌదరిపై హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ, పసుమాముల రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 421లోని వెంచర్లో రాజీవ్ కనకాలకి ఓ ఫ్లాట్ ఉంది. ఈ ఫ్లాట్‌ను కొద్ది నెలల క్రితం ఆయన నిర్మాత విజయ్ చౌదరికి విక్రయించారు. దీనికి సంబంధించి అధికారిక రిజిస్ట్రేషన్ కూడా జరిగినట్టు సమాచారం.
అయితే, విజయ్ చౌదరి అదే ఫ్లాట్‌ను ఎల్బీనగర్కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తికి సుమారు రూ.70 లక్షలకు విక్రయించారు. ఇటీవలి కాలంలో శ్రవణ్ రెడ్డి ఆ ఫ్లాట్‌ను పరిశీలించడానికి వెళ్లగా, అక్కడ ఎటువంటి నిర్మాణం లేకపోవడంతో పాటు స్థలానికి ఆనవాళ్లు కూడా లేకపోవడం గమనించారు. దీంతో తాను మోసపోయానన్న అనుమానంతో విజయ్ చౌదరిని సంప్రదించగా, వివాదం ఉందని తప్పించుకున్నాడని, గట్టిగా అడిగితే బెదిరింపులు చేసినట్టు శ్రవణ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మొదట భూమిని విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రపై స్పష్టత కోసం ఆయనకు కూడా నోటీసులు జారీ చేశారు. ఈ లావాదేవీలో అసలు సత్యం ఏమిటనేది దర్యాప్తు తర్వాత తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
Read More : బెట్టింగ్ కేసులో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసు

One thought on “భూ వివాదంలో రాజీవ్ కనకాలకి నోటీసులు”
Comments are closed.