రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోన్నటెక్నాలజీ.. సరికొత్త ఫీచర్లతో సోషల్ మీడియా యువతను తన వల నుంచి బయటపడనివ్వడం లేదు. మరోపక్క దీనికి సంబంధించిన నోటిఫికేషన్ల జడివాన. ఇవన్నీ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏదైనా ఒక అంశంపై శ్రద్ధపెట్టనివ్వకుండా సమయాన్ని వృథా చేస్తున్నాయి. మరి దీనినుంచి ఎలా బయటపడాలో సలహా ఇచ్చారు గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్ (Eric Schmidt).
డిజిటల్ ప్రపంచంలో ఏ విషయంపై కూడా ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోతున్న విషయం వాస్తవమని ఎరిక్ అంగీకరించారు. “20 నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉన్న కొందరు యువతతో నేను పనిచేస్తున్నాను. మైండ్ ను పక్కదారి పట్టించే ఇన్ని అంశాల మధ్య పనిచేయడం ఎలా అని వారు నన్ను ప్రశ్నించారు. దానికి నేను చెప్పే సమాధానం ఒక్కటే మీ ఫోనును ఆఫ్ చేయండి” అని సలహా ఇచ్చారు.
యాడ్స్, ఎంటర్టైన్మెంట్, సబ్స్క్రిప్షన్ ఇవన్నీ మనుషుల దృష్టిని మరల్చేలా రూపొందించినవేనని వెల్లడించారు. 70వేల ఏళ్లుగా మనిషి ఎలాంటి సమాచార పరికరాలు లేకుండా విశ్రాంతి పొందారని చెప్పారు. ఈ టెక్ ప్రపంచంలోనే ఎక్కువగా ఉండిపోతే.. ఆలోచన సామర్థ్యం పడిపోతుందని, మునుపటి విషయాలను గుర్తుతెచ్చుకోవడంలో తడబడుతుంటారని, ఆందోళన పెరుగుతుందని పలువురు నిపుణులు ఇప్పటికే హెచ్చరించిన విషయం తెలిసిందే.
అదే సమయంలో టెక్నాలజీని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే.. ఉపాధి అవకాశాల్లో వెనకబడిపోతారని సూచిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో నిరంతరం స్క్రోలింగ్ చేయడం తగ్గించి, దానికి బదులుగా ఏఐ టూల్స్ వినియోగంలో ప్రావీణ్యం సంపాదించడంపై దృష్టి పెట్టాలని పర్ ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ యువతకు (Gen Z) సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత ఏఐ యుగంలో మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలోనే భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. “సాంకేతికతతో పాటు వృద్ధి చెందడం అంతతేలికైన పని కాదు.” అని చెప్పారు.
Read More : గూగుల్ : అసత్య ప్రచారాలపై 11 వేల యూట్యూబ్ ఛానళ్ల తొలగింపు
