ప్రముఖ నటి బీ. సరోజా దేవి కన్నుమూత

ప్రముఖ సీనియర్ నటి బీ. సరోజా దేవి కన్నుమూశారు. ఆమె వయసు 87 ఏళ్ళు. కాగా, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సరోజా దేవి బెంగళూరు, యశ్వంత్ పురాలోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం (14 జూలై) ఉదయం 9 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.

సరోజా దేవి 70 ఏళ్ల సినీ ప్రయాణం..

సరోజా దేవీ 1938 జనవరి 7వ తేదీన బెంగళూరులో జన్మించారు. 13 ఏళ్లకే ఆమెకు సినిమా ఆఫర్ వచ్చింది. అయితే, ఆ అవకాశాన్ని ఆమె తిరస్కరించారు. కొన్నేళ్ల తర్వాత 1955లో విడుదలైన ‘మహాకవి కాళిదాసు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారు. రెండేళ్ల తర్వాత 1957లో ‘పాండురంగ మహాత్మ్యం ‘ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్ గా చేశారు.

మాతృభాష కన్నడతో పాటు తమిళం, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సినిమాలు చేశారు. 70 ఏళ్ల సినీ జీవితంలో దాదాపు 200 సినిమాల్లో నటించారు.

భర్త మరణంతో డిప్రెషన్ లోకి వెళ్లిన సరోజాదేవి…

1985లో ఆమె లేడీస్ హాస్టల్ అనే సినిమా కోసం షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె భర్త అనారోగ్యానికి గురయ్యారు. మరుసటి సంవత్సరం 1986లో ఆయన చనిపోయారు. భర్త మరణం తర్వాత ఆమె సినిమా షూటింగ్ లలో పాల్గొనలేదు. ఓ సంవత్సరం పాటు కుటుంబసభ్యుల్ని తప్ప వేరే వాళ్లను కలవను కూడా లేదు.

1987లో మళ్లీ షూటింగ్ లలో పాల్గొన్నారు. లేడీస్ హాస్టల్ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. భర్త మరణం తర్వాత ఆమె కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. భర్త మరణానికి ముందు ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేశారు. దాదాపు ఐదు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అయితే, నిర్మాతలు, ఫ్యాన్స్ బలవంతం చేయటంతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. 2019లో ‘నటసార్వభౌమ’ అనే కన్నడ సినిమాలో సరోజా దేవి చివరగా నటించారు.