‘యోగాంధ్ర 2025’కు విశాఖ సిద్ధం

విశాఖపట్నం: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర 2025’ కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. జూన్ 21వ తేదీ (శనివారం) ఉదయం విశాఖ సాగరతీరంలో జరుగనున్న ఈ యోగా మహాసభలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతుండటంతో దేశవ్యాప్తంగా ఈ వేడుకపై ఉత్కంఠ నెలకొంది.

ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు సుమారు 5 లక్షల మంది ప్రజలు యోగా అభ్యాసం చేయనున్నారు. అంత భారీ సంఖ్యలో ప్రజలు ఒకేసారి యోగా చేయడం ద్వారా గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

సాగరతీరాన్ని యోగా వేదికగా
విశాఖ ఆర్కే బీచ్‌లోని కాళీమాత ఆలయం నుంచి భోగాపురం వరకు 34 కిలోమీటర్ల తీరప్రాంతం యోగా వేదికగా సిద్ధమైంది. మొత్తం 326 సెక్షన్ల ద్వారా వినూత్నంగా ఏర్పాట్లు చేశారు. ప్రతి 40 అడుగులకు ఒక చిన్న వేదికను నిర్మించారు. వాహనాల రాకపోకలకు ఇప్పటికే నిషేధం విధించగా, క్యూఆర్ కోడ్‌ల ద్వారా ప్రవేశాన్ని అనుమతిస్తున్నారు. ప్రతి పాల్గొనేవారికి ఉచితంగా యోగా మ్యాట్, టీ షర్ట్‌ ఇవ్వనున్నారు.

రూ.62 కోట్లతో విస్తృత ఏర్పాట్లు
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.62 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 3 వేల తాత్కాలిక మరుగుదొడ్లతోపాటు ప్రతి ఐదు సెక్షన్లకు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. బీచ్ వద్ద 10 పడకల తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించారు. ప్రజల రవాణా కోసం 3600 ఆర్టీసీ బస్సులు, 7295 ప్రైవేటు బస్సులు సిద్ధం చేశారు.

వర్షం వచ్చినా భద్రమే
వర్షం వచ్చినా యోగా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రత్యేకంగా 20 వేల గిరిజన విద్యార్థులతో యోగా కార్యక్రమం చేపడతారు.

భద్రత – పర్యవేక్షణ
ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో విశాఖలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులతో బందోబస్తు, 2 వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, 11 యుద్ధనౌకలపై నౌకాదళంతో ప్రత్యేక యోగా ప్రదర్శన ఏర్పాట్లు పూర్తయ్యాయి. 26 మంది యోగా గురువులు, 1500 మంది శిక్షకులు, 6300 మంది వాలంటీర్లు కార్యక్రమాన్ని సమర్థంగా నడిపించనున్నారు.

ఈ కార్యక్రమం ద్వారా యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఆరోగ్య శాఖ మంత్రి నారాయణ తెలిపారు. “ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది యోగా చరిత్రలో ఓ భవ్య ఘట్టంగా నిలవనుంది” అని ఆయన వెల్లడించారు.

Read More : వైఎస్ జగన్‌ బీజేపీ దత్తపుత్రుడు: షర్మిల తీవ్ర విమర్శలు

One thought on “‘యోగాంధ్ర 2025’కు విశాఖ సిద్ధం

Comments are closed.