భారతదేశ రక్షణ సామర్థ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. చైనా, పాకిస్థాన్ లాంటి శత్రు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసే విధంగా అత్యాధునిక గైడెడ్ రాకెట్ వ్యవస్థను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. ‘పినాక ఎంకే-3’గా పేరుగాంచిన ఈ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ (MBRL) వ్యవస్థ అత్యుత్తమ పరిధి, ఖచ్చితత్వంతో విశేష ఆకర్షణకు దారితీస్తోంది.
పుణెలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ARDE) ఆధ్వర్యంలో, ఇతర DRDO ల్యాబ్‌ల సహకారంతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను అత్యంత కచ్చితంగా చల్లచేసే సామర్థ్యం కలిగినది. ఇది 250 కిలోల వార్‌హెడ్‌ను మోసుకెళ్లగలదు. కమాండ్ సెంటర్లు, బంకర్లు, సరఫరా కేంద్రాలపై దాడులకు ఇది అత్యంత సమర్థవంతమైన ఆయుధంగా నిలవనుంది.
ఈ రాకెట్ వ్యాసం 300 మిల్లీమీటర్లు. పాత మోడళ్ల కంటే ఇది చాలా మెరుగైనదిగా రూపుదిద్దుకుంది. ఇందులో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) అభివృద్ధి చేసిన ఆధునిక గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ (GNC) కిట్‌ను ఉపయోగించారు. లేజర్ గైరో నావిగేషన్, మైక్రోస్ట్రిప్ యాంటెనాలు, 10 మీటర్లలోపు సీఈపీ (Circular Error Probable) సామర్థ్యం ఉన్న ఈ వ్యవస్థలో ఖచ్చితత్వం అమోఘంగా ఉంది. గత పినాక ఎంకే-1లో సీఈపీ సుమారు 500 మీటర్లుగా ఉండేది.
పినాక ఎంకే-3ను ఇప్పటికే ఉన్న పినాక లాంచర్ల నుంచే ప్రయోగించవచ్చు. దీని వల్ల అదనపు పెట్టుబడులు లేకుండానే దీన్ని ఉపయోగించవచ్చు. ఒక్కో లాంచర్లో ఎనిమిది గైడెడ్ రాకెట్లు ఉంటాయి. ఇవి కేవలం 44 సెకన్ల వ్యవధిలో 700×500 మీటర్ల ప్రాంతాన్ని ఛేదించగలవు.
చైనాకు చెందిన PHL-03 (పరిధి: 70–130 కి.మీ.), పాకిస్థాన్‌కు చెందిన A-100 (పరిధి: 120 కి.మీ.) వంటి శత్రు దేశాల దీర్ఘ శ్రేణి రాకెట్ వ్యవస్థల్ని ఎదుర్కొనే ఉద్దేశంతో భారత సైన్యం ఇప్పటికే 2021లో పినాక ఎంకే-3 లాంటి వెర్షన్లకు ఆమోదం తెలిపింది.
ఈ అభివృద్ధి భారత రక్షణ రంగంలో ప్రగతికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. భారత్ స్వయంప్రతిపత్తిని మరింత బలోపేతం చేస్తోంది.
Read More : ట్రాఫిక్ పోలీసుల తీరుతో చిన్నారి మృతి

One thought on “భారత్: డీఆర్డీవో అభివృద్ధిలో మరో మైలురాయి”
Comments are closed.