మాజీ సీఎం శపథం: డీఎంకేను కూల్చి వేస్తామన్న ఎడప్పాడి పళనిస్వామి
చెన్నై: వచ్చే ఏడాది సంక్రాంతికి డీఎంకేను కూకటి వేళ్లతో సహా పెకలించి రాష్ట్రం నుంచి తరిమికొడతామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami) శపథం చేశారు. అన్నాడీఎంకే సేలం సబర్బన్ శాఖ ఆధ్వర్యంలో వీరపాండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని పుత్తూరు ప్రాంతంలో బుధవారం ఉదయం నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన ఎడప్పాడి పళనిస్వామి, సంక్రాంతి (Sankranti) వేడుకల్లో పాల్గొనడం ఓ రైతు బిడ్డగా తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో డీఎంకే (DMK) వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, వచ్చే పొంగల్ నాటికి ఆ పార్టీని కూల్చి పడేసేలా అన్నాడీఎంకే శ్రేణులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తన హయాంలో ప్రారంభించిన పశుసంవర్థక పరిశోధనా కేంద్రాన్ని డీఎంకే ప్రభుత్వం మూడేళ్లుగా ప్రారంభించకుండా ఆలస్యం చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానన్న భయంతో డీఎంకే ప్రభుత్వం ఇప్పుడే ఆ కేంద్రాన్ని ప్రారంభించిందని ఆరోపించారు.
పార్టీ శ్రేణులకు పిలుపు:
పార్టీ కార్యకర్తలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని, వెంటనే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని పిలుపునిచ్చారు.
సంబంధిత వార్త:
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడపై హెచ్చరికలు
