వాషింగ్టన్: అమెరికాలో అధికార మార్పిడి సమీపిస్తున్న సందర్భంగా మరోసారి ఆర్థిక ప్రతిష్టంభన (Shutdown) ప్రమాదం తలెత్తింది. క్రిస్మస్ సమయానికే ఆర్థిక వ్యవస్థ స్తంభించకుండా ఉండేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్లాన్‌ను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా తిరస్కరించారు. ఈ నిర్ణయం తరువాత, చర్చలు తప్పనిసరిగా జరగాల్సిన అవసరం ఉందని స్పీకర్ మైక్ జాన్సన్, రిపబ్లికన్ చట్టసభ్యులకు సూచించారు. ఫెడరల్ ప్రభుత్వ నిధులు తగ్గిపోతున్న సమయంలో ఈ పరిణామంతో, ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంది.
అయితే, ట్రంప్ నిర్ణయం వెనక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిధుల బిల్లో ఖర్చులు భారీగా పెరిగాయంటూ మస్క్ సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయమణిచారు. 1500 పేజీల ఈ బిల్లు మంగళవారం రాత్రి బయటకు వచ్చిన వెంటనే, టెస్లా అధినేత “దీన్ని ఆమోదించకూడదు” అని పోస్ట్ చేశారు. ఈ బిల్లు పై ఓటు వేసే చట్టసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన పరోక్షంగా హెచ్చరించారు.
ఈ పోస్ట్ వేసిన కొద్ది గంటలకే, ట్రంప్ రిపబ్లికన్ నేతలకు ఈ బిల్లును ఆమోదించకుండా చర్చ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలని ఉంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు శుక్రవారం లోగా ఆమోదం లభించాలి. ఈ నేపథ్యంలో, బుధవారం ట్రంప్, తన కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. “రిపబ్లికన్లు చాలా తెలివైనవారు” అని పేర్కొంటూ, ఈ బిల్లును ఆమోదించకూడదని, దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని స్పీకర్ మైక్ జాన్సన్ మరియు ఇతర రిపబ్లికన్ చట్టసభ్యులకు గట్టిగా సూచించారు.
ఇదిలా ఉంటే, తాజా ఆర్థిక ప్రణాళికలో, హరీకేన్ బాధిత రాష్ట్రాలు మరియు ఇతర ప్రకృతి విపత్తుల బాధితుల కోసం 100.4 బిలియన్ డాలర్లు కేటాయించడంతో, డెమోక్రటిక్ నేతలు ఈ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారు. అలా జరిగితే యావత్ అమెరికన్లు ప్రతిరోజూ ఇబ్బందులు ఎదుర్కొంటారు” అని వారు అన్నారు.
మరోవైపు, ఎలాన్ మస్క్ తన విజయంలో కీలక పాత్ర పోషించడంతో, ట్రంప్ తన కొత్త పాలకవర్గంలో కీలక పదవి అప్పగించిన విషయం తెలిసిందే. మస్క్‌ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE)కి సంయుక్త సారథిగా నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ బాధ్యతలు తీసుకోకముందే, ట్రంప్ నిర్ణయాలను మస్క్ నియంత్రిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
