అభయ హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు, కోల్‌కతా హైకోర్టులో విచారణ

ఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్ మెడికల్ కళాశాల (RG Kar Medical College) ట్రైనీ డాక్టర్ “అభయ” హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు, కోల్‌కతా హైకోర్టు ఇవాళ (బుధవారం) విచారణ చేపట్టనున్నాయి. జనవరి 20న ఈ ట్రైనీ డాక్టర్ హత్య కేసు విచారణ సమయంలో సంజయ్ రాయ్‌ను ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. అతనికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.50 వేల జరిమానా విధించినట్లు కోర్టు ఆదేశించింది. అలాగే, బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించమని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ తీర్పుపై బాధితురాలి తల్లిదండ్రులు మరియు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వారు సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో, తీర్పు వెలువడిన 24 గంటలలోపు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కిషోర్ దత్తా మంగళవారం ఉదయం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే, సీబీఐ దర్యాప్తు సరిగ్గా జరగలేదని, సమగ్ర దర్యాప్తు చేయాలని అభయ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని నేడు విచారణ చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కె.వి.విశ్వనాథన్ ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. మరోవైపు, బెంగాల్ ప్రభుత్వం సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరగనుంది. కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ దేబాంగ్షు బసక్, జస్టిస్ షబ్బర్ రషీదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనుంది.

ఈ వార్త కూడా చదవండి

One thought on “అభయ హత్యాచారం కేసుపై సుప్రీంకోర్టు, కోల్‌కతా హైకోర్టులో విచారణ

Comments are closed.