అట్లాంటాలో శంకర నేత్రాలయ అమెరికా సంస్థ పేద రోగుల దృష్టిని పునరుద్ధరించేందుకు నిధుల సేకరణ కోసం శాస్త్రీయ నృత్య కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా 1,300,000 డాలర్లు (సుమారు రూ.10 కోట్లు) సేకరించబడ్డాయి. ఈ నిధుల ద్వారా 20,000 కంటిశుక్లం శస్త్రచికిత్సలు చేయగలమని నిర్వాహకులు తెలిపారు.
అట్లాంటా నగరంలోని నాలుగు ప్రముఖ శాస్త్రీయ నృత్య అకాడమీలు 100 మంది విద్యార్థులతో తమ ప్రదర్శనలను వేదికపై అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. అకాడమీ ఆఫ్ కూచిపూడి వారు “వాసవీ కన్యకా పరమేశ్వరి” నృత్య ప్రదర్శనను ఆకట్టుకున్నారు. కలైవాణి డ్యాన్స్ అకాడమీ వారు “శరణం అయ్యప్ప” నృత్యాన్ని 13 మంది కళాకారులతో ప్రదర్శించారు. శ్రీవాణి కూచిపూడి అకాడమీ వారు “నాద బ్రహ్మ శంకర” నృత్య ప్రదర్శనతో వేదికపై మెరిశారు.
ఎస్‌ఎన్ యుఎస్‌ఎ బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యుడు డాక్టర్ కిషోర్ చివుకుల 100,000 డాలర్ల విరాళం అందించారు. ఈ విరాళం కంటి సంరక్షణ సేవలను పేదలకు అందించడంలో కీలకంగా పనిచేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ జగదీష్ షేత్ 12,500 డాలర్ల విరాళం ద్వారా అడాప్ట్-ఎ విలేజ్ కంటి శిబిరం కోసం మద్దతు తెలిపారు.
ఇంకా, ఆగస్టా, జార్జియా నుండి రామచంద్రారెడ్డి 8 కంటి శిబిరాలకు 100,000 డాలర్లు విరాళం ప్రకటించారు.
ఎస్‌ఎన్ యుఎస్‌ఏ ప్రెసిడెంట్ బాలా రెడ్డి ఇందుర్తి నాయకత్వంలో గణనీయమైన నిధులను సేకరించడం, అలాగే తన విశేష సేవలకు శంకరరత్న పురస్కారంతో గుర్తింపును పొందడం పట్ల నిర్వాహకులు అభినందించారు.
అట్లాంటా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తడికమళ్ళతో సహా, చాప్టర్ లీడర్లు, ఎస్‌ఎన్ యుఎస్‌ఏ ట్రస్టీలు, మరియు ఇతర ప్రముఖుల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది.
