ఉదయాన్నే 4 లీటర్ల నీరు తాగడం: ఊహించని ప్రమాదంలో పడ్డ మహిళ

ఆరోగ్యం: ఊహించని ప్రమాదంలో పడ్డ మహిళ! ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగితే..

శరీరంలోని విషతుల్యాలను తొలగించుకోవడం కోసం ఉదయాన్నే ఒకేసారి 4 లీటర్ల నీరు తాగిన ఓ మహిళకు ఊహించని ప్రమాదం ఎదురైంది.

ఇంటర్నెట్ డెస్క్: నేటి కాలంలో ఆరోగ్యం పై ప్రజల స్పృహ పెరిగింది. కసరత్తులు, డైట్ మొదలు ఇతర జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే, ఈ విషయాల్లో అవగాహన లేకపోతే సమస్యలు తప్పవని తాజాగా జరిగిన సంఘటన ద్వారా తేలింది. శరీరంలోని విషతుల్యాలను తొలగించేందుకు ఉదయం 4 లీటర్ల నీరు తాగిన ఓ మహిళకు చివరకు ఊహించని ప్రమాదం జరిగింది.

తన శరీరంలో మలినాలను తొలగించేందుకు ఎక్కువ నీరు తాగిన తరువాత, ఆ మహిళకు తల తిరిగినట్లు, కన్ఫ్యూజన్ ఏర్పడినట్లు అనిపించింది. కాసేపటికే ఫిట్స్ రావడంతో ఆమె కిందపడిపోయి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు, అక్కడ వైద్యులు అసలైన సమస్యను గుర్తించారు. రక్తంలో సోడియం శాతం తగ్గిపోవడంతో వాటర్ ఇన్‌టాక్సికేషన్ (Water Intoxication) బారినపడినట్టు గుర్తించి చికిత్స ఇచ్చారు. ‘‘ఆమెను చూశప్పుడు హైపోనాట్రేమియా (Hyponatremia) బారినపడిందని అనుమానించి, పరీక్షల్లో అది నిర్ధారితమైంది’’ అని వైద్యులు చెప్పారు.

వాటర్ ఇన్‌టాక్సికేషన్ అంటే ఏమిటి?

శరీరంలో పరిమితికి మించి నీరు చేరడం వాటర్ ఇన్‌టాక్సికేషన్ అని పిలవబడుతుంది. ఇది శరీరంలోని రసాయనాల సమతౌల్యాన్ని భంగం చేస్తుంది. అధికంగా చేరిన నీరు రక్తాన్ని పలుచగా చేస్తుంది, తద్వారా కీలకమైన ఎలక్ట్రోలైట్స్, ముఖ్యంగా సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా, కణాలు ఉబ్బిపోతాయి, అలాగే మెదడు కణాల్లో కూడా నీరు చేరడం వల్ల కన్ఫ్యూజన్, ఫిట్స్ వంటి లక్షణాలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

వాటర్ ఇన్‌టాక్సికేషన్ లక్షణాలు:

అతిగా నీరు తాగడం వల్ల కడుపులో తిప్పటం, వాంతులు, కడుపు ఉబ్బడం, తలనొప్పి, తల తిరిగినట్లు అనిపించడం, కండరాలు బలహీనంగా అనిపించడం, నొప్పులు, కాళ్లు, చేతులు, పొట్ట వాపు వంటి లక్షణాలు కనిపించవచ్చు. మూత్రం రంగు లేత పసుపులో మారడం, ఈ లక్షణాలను అనుభవించిన వెంటనే నీరు తాగడం ఆపాలి. ఇంకా సమస్య కొనసాగితే వైద్యులను సంప్రదించడం మంచిది. సాధారణంగా ఒకటి లేదా రెండు గంటల్లో 3 నుండి 4 లీటర్ల నీరు తాగడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. ఇబ్బంది మొదలైన వెంటనే నీరు తాగడం ఆపాలి. సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం చాలా అవసరం.