వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం రూపుదిద్దుకుంది. రాబోయే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అనంతరం 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ ఒడిశా మీదుగా వెళ్లే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడవచ్చని చెప్పారు. మత్స్యకారులు సముద్ర వేటకు వెళ్లవద్దని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
గోదావరి నదిలో వరద స్వల్పంగా తగ్గిందని, ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 10.78 లక్షల క్యూసెక్కులుగా నమోదైందని ఆయన అన్నారు. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ప్రవాహం 3.42 లక్షల క్యూసెక్కులుగా ఉందని, వరద పూర్తిగా తగ్గే వరకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇక తెలంగాణలో కూడా అల్పపీడనం ప్రభావం కనిపించనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ (మంగళవారం), రేపు (బుధవారం) రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని చెప్పారు. భారీ వర్షాల హెచ్చరికగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
Read More : డాక్టర్ వైఎస్ఆర్ 16వ వర్ధంతి: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
